అమరావతి: శాసనమండలిలో గురువారం ఉల్లి ధరలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో.. హెరిటేజ్ పేరెత్తగానే సభ నుంచి టీడీపీ సభ్యులు నిష్క్రమించారు. ఆంధ్రప్రదేశ్ మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ సభలో మాట్లాడుతూ.. రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలను సబ్సిడీ కింద కేవలం రూ. 25కే పంపిణీ చేస్తున్నామని.. రేపటి నుంచి మార్కెట్ యార్డులో కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఉల్లి ధర హెరిటేజ్ మార్కెట్‌లో రూ.150 ఉందని చెబుతుండగా.. ఒక్కసారిగా తెలుగుదేశం సభ్యులు ఉలిక్కిపడ్డారు. ఇక హెరిటేజ్ సంస్థకు, తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని నారా లోకేష్ అనడంతో సభలో రభస నెలకొంది. హెరిటేజ్ పేరెత్తగానే ఎందుకు పారిపోతారంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు.. టీడీపీ సభ్యులను ఎద్దేవా చేశారు.
ఉల్లిపాయలు మెడలో వేసుకుని పొర్లుదండాలు పెట్టినా తెలుగుదేశాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. పబ్లిసిటీ కోసం టీడీపీ సభ్యులు మెడలో వేసుకొచ్చిన ఉల్లిపాయలు కూడా ప్రభుత్వం సబ్సిడీ కింద ఇచ్చినవే అని హేళన చేశారు. పేదలకు చెందాల్సిన ఉల్లిపాయలను ఇటీవల తెలుగుదేశం నాయకులు దుర్వినియోగం చేశారంటూ దుయ్యబట్టారు.