విజయవాడ: దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు రానున్నాయని ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఏపీ మహిళా కమిషన్, మహితా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్యవివాహాలు అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సదస్సులో పాల్గొని హెల్ప్‌లైన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ.. బాల్య వివాహాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని అన్నారు. బాల్య వివాహాలు జరగడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు కుటుంబ సమస్యలు తలెత్తుతున్నాయని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, ఇతర నేరాలను అరికట్టేందుకు.. కేవలం 21 రోజుల్లో తీర్పు వచ్చేలా తీసుకువచ్చిన దిశ చట్టంతో మహిళలకు మంచి రోజులు వస్తాయని, దానికి దిశ చట్టమే సంకేతమంటూ హర్షం వ్యక్తం చేశారు. యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన దిశ ఘటనలో.. నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని అందరూ స్వాగతించారన్నారు. రాష్ట్రంలో మహిళలకు మేమున్నామని భరోసా ఇస్తూ ప్రభుత్వం ముందుగానే చర్యలు తీసుకుని కొత్త చట్టాన్ని తీసుకురావడం శుభ పరిణామం అని పేర్కొన్నారు.